సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, రమ్యభావం, మనోహరమైన భాష అన్నీ ఒద్దికగా ఒయ్యారంగా నడచిన విన్యాసం శ్రీ వారణాసి వెంకట్రావుగారి రచనలు. ప్రతి పంక్తిలో కవితాశిల్పి స్ఫూర్తి దీపిస్తూ ఈనాడు తండోపతండాలుగ వెలువడే రచనల్లో ఇది ఒక పండువెన్నెలగా రమ్యమైన ఇంద్రధనస్సుగా ఉంది. అనుభూతి పైకుబికి చదువురుని ఆ స్థాయికి తీసుకొనిపోతున్నది. ఇదేకదా కవితకు నికషోఫలం. వీరి కవితలన్నీ క్రొత్తపోకడలే!

- భారతి


        పాపలో పరమాత్మ నృత్యరూపక ప్రదర్శనలో మనిషి ఎదుగుదలలో డార్విన్ సిద్ధాంతాన్ని తలచుకొంటూ తృప్తిపడే ఛాందసులకన్నా పాపాయి ఎదుగుదలగా, పరమాత్మ రూపాలనే దశావతారాలను క్రమపరిణామ దశలుగా వర్ణిచడంలో కవి కల్పనాశక్తిని చాటుతుంది. భావం ఏదైన చక్కని శైలిలో చెప్పగల ఈ కవి అది ఇది అనక 'కాదేదీ కవితకనర్హం' అన్నట్లు పాడుకోవడానికి అనువుగా అందరికీ ఉపయోగపడే విధంగా గేయాలు వ్రాశారు.

- ఆంధ్రజ్యోతి వీక్లీ


        వెంకట్రావుగారి కవితాసంపుటిలోని కొన్ని నృత్యరూపక ప్రదర్శనలలో 'జటాయుమోక్షం' ఆణిముత్యం. వీరి రచనలు రాశికంటే వాసి ప్రాధాన్యత కలవి.

- గానకళా సాంస్కృతిక మాసపత్రిక


        శ్రీ వారణాసి వెంకట్రావుగారి గేయరచనకు నాలుగు పార్శ్వాలు ఉన్నవి. అవి వినోదం, వినియోగం, ప్రయోగం, ప్రయోజనం. అందుకే వీరు గేయబ్రహ్మగా కనుబడతారు. వీరి సంగీత నృత్యరూపకాలు వారి ప్రయోగ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తున్నాయి.

- ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ప్రొఫెసర్


        శ్రీ వారణాసి వెంకట్రావుగారు స్వయంగా సంగీత విద్వత్ కుటుంబ వారసులు. అటువంటివారు ఊసుపోక గీతరచన చేయరు. వీరి గీతాలన్నీ ఫలపుష్ప భరితమైన గేయనికుంజంలా కనిపిస్తాయి.

- కళాప్రపూర్ణ డా. బాలాంత్రపు రజనీకాంతరావు