ఋతుసంభవ నృత్యరూపకం మహాకవి కాళిదాసు ఋతుసంహారం, కుమారసంభవం కావ్యలలోని కుమారస్వామి జననం ఇతివృత్తంగా తీసుకొని శివుడు చూపిన విన్యాసతాండవాల్లో ప్రకృతి ఆరు ఋతువులుగా భాసించినట్లు రూపక రచయిత శ్రీ వారణాసి వెంకట్రావు తమదైన శైలిలో చక్కని ప్రతిభ కనపరిచారు.

- భాస్కర్, సాహితీ వార్తాపత్రిక


        శ్రీ వెంకట్రావుగారి గీతరచన మామిడి చిగుళ్ళ వంటి పదాలతో చైత్రమాసంలోని చిరుగాలి వంటి శైలితో హాయిగా అనుభూతిపరంగా కోయిల పాడుతున్నట్లుంటాయి వీరి గేయాలు. ఎన్నో కవితా ధోరణుల వాదాల గందరగోళాల వర్తమాన రచనా ప్రపంచంలో ప్రశాంత సుమ పరిమళ మృదుసమీరం ఈ గేయశతం.

- శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, చలనచిత్ర గీత రచయిత


        శ్రీ వారణాసి వెంకట్రావు రచయిత. స్వయంగా గాయకుడు కావడం మూలాన వీరి గీతికలన్నీ సంగీతికలుగా రూపుదిద్దుకున్నాయి. రచయితకు రమణీయమైన భావసంపద ఉన్నది కమనీయమైన కల్పనాశక్తి ఉన్నది. చక్కని హృదయం ఉన్నది. చిక్కని అనుభూతి ఉన్నది.

- కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి


        మెత్తని చివుళ్ళను ఏరుకోవడం, వాటిని సుకుమారంగా అల్లటం ఆ చివురల పందిరిలో అక్కడక్కడ చక్కని ఉపమాన మొగ్గలను సంతరించడం - ఈ శిల్పం వెంకట్రావుగారిలో గోచరిస్తున్నది. ఉపమానాలు ఎరువు తెచుకున్నవి కావు. ఊహిస్తే ఉపమానాలకు కరువా అనిపించే కవివేరు.

- డా. రావూరి సత్యన్నారాయణరావు


        "వసంతవల్లరి" యను పేరే ఎంతో సుందరముగా నున్నది. ఈ వల్లరిని పూచిన పూలు కవిగారైన శ్రీ వారణాసి వెంకట్రావుగారి యశస్సునకు సౌరభమును, కృతిభర్తలైన శ్రీ జంధ్యాల బాలభాస్కర శాస్త్రిగారి జీవితమును కలంకారమును చేకూర్చునుగాక యని యాశీర్వదించుచున్నాను.

- డాక్టరు దివాకర్ల వేంకటావధాని, ఎం.ఎ. (ఆనర్సు)., పి.హెచ్.డి.