ప్రకృతి మాత పచ్చని చల్లని ఒడియైన తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరి చెట్టై పుట్టటానికైనా పూర్వజన్మ సుకృతం ఉండాలని నమ్మే శ్రీ వారణాసి వెంకట్రావు గారు అమ్మవారి ఊరైన ఏనుగుల మహల్ (మందపల్లి) లోని వేదవిద్యపారంగతులు జ్ఞానసంపన్నులు అయిన బ్రహ్మశ్రీ రాణిప్రసాదచైన్లు గారింట్లో జన్మిచారు. ఉద్యోగ రీత్యా 60 సంవత్సరాలుగా విజయవాడలో ఉంటున్నారు. గోదావరి తీరాన పుట్టి కృష్ణా తీరాన కొలువై యున్న కనక దుర్గమ్మ సన్నిథికి వచ్చి స్థిరపడే అవకాశాన్ని అదృష్టమైన దైవఘటనగానే వారు భావిస్తారు.

        శ్రీ వెంకట్రావు గారు సుమారు యాభై సంవత్సరాల నుండి ఎన్నో పాటలు వ్రాసి సంగీతం కూడా సమకూర్చి పేరున్న రచయితగా ప్రాచుర్యం పొందారు. చాలా వైవిధ్యమైన అంశాలు పాటలు వ్రాయటానికి ఎన్నుకొని సఫలికృతులైనారు. వ్రాయ దలచిన గేయం ప్రకృతి గురించైనా, ప్రణయం గురించైనా, దేవుని స్తుతిస్తూ అయినా, దేశాన్ని స్తుతిస్తూ అయినా, జావళి అయినా, జానపదమైనా వినూత్న విలక్షణ భావ చేవ వీరి కలానికి దైవబలం. ముఖ్యంగా లలిత గీతాలు, జానపదాలు, పిల్లల పాటలు, భక్తి పాటలు, నృత్యాంశాలుగా మలచుకోగల గేయ రూపకాలు వ్రాసి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యన్నారయణ గారి ప్రశంసలు కూడ పొందారు. 1978 లో మహాకవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి, డాక్టర్. రావూరి సత్యన్నారయణ గారి ముందు మాటలతో "వసంత వల్లరి" అనే తొలి గేయ సంకలనం కరుణశ్రీ గారి ఆధ్వర్యంలోనే ఆవిష్కరించారు. వీరి గీతాలు చాలా విజయవాడ "AIR" కేంద్రం నుంచి ఈ మాసపు పాటలుగా, లలిత గీతాలుగ, సంగీత రూపకాలుగా ప్రసారమై పలువురి ప్రశంసలు పొందాయి. వీరు "AIR" అప్రూవ్డ్ రైటర్. వెంకట్రావు గారు రచించిన మాతృబోధ, కోయ, ఋతు సంభవం, పాపలో పరమాత్మ, నదీ నర్తనం, జటాయు మోక్షం మొదలగు నృత్యాంశాలుగా రూపుదిద్దుకుని అంధ్రదేశంలోనూ, అమెరికాలోనూ, కూడా ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. తదుపరి డా. తిరుపల శ్రీనివాసాచార్య గారి, డా. జీ.వి. సుబ్రహ్మణ్యం గారి ముందుమాటలతో 2001 సంవత్సరంలో "గేయనికుంజం" అనే మరో గేయసంకలనం ప్రచురించారు. 'కళ్యాణకనకదుర్గ, 'శ్రీ పాద శ్రీ వల్లభ, 'నమో షిరిడీశ ' , 'సత్యసాయి కో స్వర్ణసుమం' , 'ధర్మ శాస్త దర్శనం', 'శివతత్త్వ సప్తకం' అనే భక్తి పాటల CDలు 'పండుగల సందడి', 'వెలుగు రేకలు', 'రంగుల పూలు', ''కుహూ కుహూ' అనే పిల్లల CDలు కూడా వెలువరించారు. 2015 నవంబరులో డా. తిరుమల శ్రీనివాసాచార్య, ప్రొ. ముదిగొండ శివప్రసాద్, డా. నిడమర్తి నిర్మలా దేవి, శ్రీ దేవరకొండ మురళీ కృష్ణ, మ్యూజిక్ కంపోజర్ & రచయిత శ్రీ డి. వీరభద్ర రావు గారి ముందు మాటలతో 'కోయిల వాలిన కొమ్మ ' అనే మరో గేయ సంకలనంతో పాటు చాలా వరకు వీరే సంగీతం సమకూర్చిన సుమారు 70 పాటలతో MP3 CDని జతపరచి ఆవిష్కరించారు.

        'సాహితి మహతి ' అనే సంగీత సాహిత్య నృత్య సంస్థ వారిచే "భావ సుధార్ణవ" మరియు విజయవాడలోనున్న ప్రముఖ సంగీత సాహిత్య సంస్థలు ప్రసన్న భారతి, పార్థ తేజంల వారిచే "భావ కవితా మహతి" అనే బిరుదులతో శ్రీ వారణాసి వెంకట్రావు గారిని సత్కరించారు.

        శ్రీ వెంకట్రావుగారు పొస్టల్ డెపార్టుమెంటులో పనిచేసి 1998 లో పదవీ విరమణ చేశారు. పిల్లలు, మనుమలతో శ్రీ వెంకట్రావు గారి దంపతులు ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు.